హైదరాబాద్ : న్యూ ఇయర్ 2026 సందర్భంగా తెలంగాణలో భారీ ఎత్తున మద్యం విక్రయాలు జరిగాయి. గతంలో కంటే ఈసారి మందు బాబులు మరింత ఎక్కువగా తాగారని తేలింది. ప్రస్తుత ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా ఆబ్కారీ శాఖ నుంచి అందుతుండడంతో ఈసారి కొత్త సంవత్సరం కానుకగా 24 గంటల పాటు మద్యం దుకాణాలు తెరిచి ఉంచేందుకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో గత ఏడాది డిసెంబర్ 31వ తేదీ ఉదయం నుంచి జనవరి 1వ తేదీ గురువారం సాయంత్రం వరకు ఇంకా తాగుతూ, ఊగుతూనే ఉన్నారు. ఓ వైపు మద్యం ప్రియుల ఒళ్లు గుళ్లవుతుంది. ఎవరూ ఊహించని రీతిలో భారీ ఎత్తున అమ్మకాలు కొనసాగడంతో తెలంగాణ సర్కార్ కు ఏకంగా ఎక్సైజ్ శాఖ ద్వారా ఏకంగా రూ. 1,350 కోట్లు వచ్చినట్లు సమాచారం. కేవలం ఇదంతా గత ఆరు రోజులుగా అమ్ముడు పోయిన మద్యం కావడం విశేషం.
కేవలం మూడు రోజుల్లోనే దాదాపు రూ. 1,000 కోట్ల విలువైన మద్యం అమ్ముడైందని అధికారులు వెల్లడించారు. అధికారిక డేటా ప్రకారం గత ఆరు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1400 కోట్లకు పైగా అమ్ముడు పోయిందని తెలిపారు. మూడు రోజుల పండుగ కాలంలో, 8.30 లక్షల కేసుల మద్యం, 7.78 లక్షల కేసుల బీర్ అమ్ముడయ్యాయి. ఇది నూతన సంవత్సరానికి ముందు, వేడుకల సమయంలో ఉన్న అధిక డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది. ఇదిలా ఉండగా మద్యం దుకాణాల వద్ద పెరిగిన రద్దీ, పండుగ డిమాండ్ పెరగడమే ఈ అమ్మకాల పెరుగుదలకు కారణమని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. అమ్మకాల పెరుగుదల వల్ల ఎక్సైజ్ ఆదాయం ద్వారా రాష్ట్ర ఖజానాకు గణనీయమైన ప్రోత్సాహం లభించింది.
