ఆర్టీసీని ప్ర‌భుత్వ సంస్థ‌గా విలీనం చేయాలి

డిమాండ్ చేసిన జ‌స్టిస్ చంద్ర‌కుమార్

hellotellugu-JusticeChandraKumar

హైద‌రాబాద్ : టీఎస్డీఎఫ్ చైర్మ‌న్ జ‌స్టిస్ చంద్ర‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తెలంగాణ ఆర్టీసీ సంస్థ కార్మికులు చేస్తున్న ఆందోళ‌న‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్‌లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అన్నారు. ఆర్టీసీని వెంట‌నే ప్రభుత్వ సంస్థగా విలీనం చేయాల‌ని, ప్రైవేటీకరణను నిలిపి వేయాలని కోరారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు తమ హక్కులు, ఉద్యోగ భద్రత, సంస్థ పరిరక్షణ కోసం చేపట్టిన సమ్మె పూర్తిగా న్యాయ సమ్మతమైనదని పేర్కొన్నారు జ‌స్టిస్ చంద్ర‌కుమార్. కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా, వారి న్యాయమైన డిమాండ్లను విస్మరిస్తూ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరి తీవ్రంగా ఖండించదగినదని పేర్కొన్నారు.

కార్మిక సంఘాల నాయకులు పలుమార్లు స్పష్టం చేసినట్టుగా, ఈ సమ్మె వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాద‌న్నారు. ప్రజా రవాణా వ్యవస్థను కాపాడటానికి, ఆర్టీసీ సంస్థను బలోపేతం చేయడానికి జరుగుతున్న పోరాటం అని స్పష్టం చేశారు . కాంట్రాక్ట్ , అవుట్సోర్సింగ్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాల‌న్నారు. ఉద్యోగ భద్రత, సముచిత వేతనాలు, పెన్షన్ హక్కులు కల్పించడం, ఎలెక్ట్రిక్ వాహనాలను ప్రైవేట్ వారికి ఇస్తూ ఆర్టీసీని ప్రైవేటీకరణ వైపు నెట్టే విధానాలను వెంటనే ఉపసంహరించు కోవాల‌ని డిమాండ్ చేశారు జ‌స్టిస్ చంద్ర‌శ‌కుమార్.

ప్రభుత్వం కార్మికుల న్యాయ బద్ధమైన డిమాండ్‌లను పరిష్కరించకుండా, సమ్మెను అణచి వేయడానికి ప్రయత్నించడం తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. ముఖ్యంగా, సమ్మె చేస్తున్న కార్మికులపై పోలీసులు ప్రదర్శిస్తున్న దమనకాండ దారుణ‌మ‌న్నారు. ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం అన్నారు. ఆర్టీసీ సంస్థ కేవలం ఒక రవాణా వ్యవస్థ మాత్రమే కాదని, ఇది లక్షలాది ప్రజలకు జీవనాధారం అని గుర్తు పెట్టుకోవాల‌న్నారు.

Exit mobile version