హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంది. కీలక ఒప్పందాలు చేసుకుంది. ఈ సందర్బంగా భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చినట్లు తెలిపింది ప్రభుత్వం. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసిందని పేర్కొంది. మూడు రోజుల పాటు జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో నిర్దేశిత లక్ష్యాలు, దార్శనికతను ప్రపంచానికి చాటడంలో ప్రతినిధి బృందం సఫలీకృతమైందని స్పష్టం చేసింది.
హైదరాబాద్‌లో గత నెలలో జరిగిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిందని వెల్లడించింది. ఆ నేపథ్యంలో దావోస్ లో పెట్టుబడులకు మించి రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలు, సమగ్రాభివృద్ధిపై విజన్ లక్ష్యాలు, బృహత్ ప్రణాళికలను ప్రపంచానికి చాటి చెప్పాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరిందని పేర్కొంది. మూడు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో ప్రతినిధి బృందం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించిందని తెలిపింది. అలాగే ప్రభుత్వం ఏఐ, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ కార్యక్రమాలకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.
ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించిన రెండు కీలక సెషన్లలో పాల్గొన్నారని. ఫాలోఅప్‌గా జూలై, ఆగస్టు నెలల్లో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించాలని సదస్సులో చేసిన ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించిందని ప్రభుత్వం తెలిపింది.
