అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీఐ పేమెంట్స్ ద్వారా మిలియన్ల సంఖ్యలో ఆర్ధిక లావాదేవీలు క్షణాల్లో జరుగుతున్నాయని ఈ నేపథ్యంలో గోల్డెన్ అవర్ ఫండ్ రికవరీ అంశంపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ అంశంపై మరిన్ని సాంకేతిక పరమైన నూతన ఆవిష్కరణలు రావాల్సి ఉందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. సైబర్ నేరాల నియంత్రణలో ఏపీటీఎస్ ముఖ్య భూమిక పోషించాలని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో టెక్నాలజీలను అధ్యయనం చేయాలని సూచించారు. అన్ని బ్యాంకులు వారాంతాల్లో పెద్ద మొత్తంలో జరిగే ఆర్ధిక లావాదేవీలపై దృష్టి పెట్టాలన్నారు. కొన్ని నిబంధనల్ని మార్చుకునే విషయంలో రిజర్వు బ్యాంకును సంప్రదించాలని సూచించారు సీఎం. రిజర్వు బ్యాంకు తీసుకు వచ్చిన మ్యూల్ ఆకౌంట్ హంటర్ ఏఐ లాంటి టూల్స్ ను నకిలీ ఖాతాలను గుర్తించేందుకు వినియోగించాలన్నారు.
హర్యాణా, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో ఉత్తమ విధానాల్ని అధ్యయనం చేసి ఓ నిర్దుష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో పాటు సైబర్, ఆన్ లైన్ ఆర్ధిక మోసాలపై ప్రజల్లో నిరంతరం అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఏపీలో సైబర్, ఆర్ధిక నేరాలకు సంబంధించి 9.29 లక్షల కాల్స్ బాధితుల నుంచి 1930 టోల్ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదులు వచ్చినట్టు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరించారు. సైబర్, ఆర్ధిక నేరాల బారిన పడి ఏపీలో ఇప్పటి వరకూ రూ.652 కోట్లను బాధితులు కోల్పోయినట్టు తెలిపారు. సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం-బ్యాంకర్లతో కలిసి రూ.116 కోట్ల పైచిలుకు మొత్తాన్ని సైబర్ నేరగాళ్లకు చేరకుండా కాపాడగలిగామని స్పష్టం చేశారు.


















