హైదరాబాద్ : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. T20 ప్రపంచ కప్‌లో భారతదేశం సాధించిన విజయంపై స్పందించారు. జట్టు ఇంత బాగా ఆడినందుకు చాలా సంతోషం కలిగించిందని చెప్పారు. జట్టు వరుసగా రెండుసార్లు T20 ప్రపంచ కప్‌ను గెలుచు కోవడం మామూలు విషయం కాదన్నాడు . అన్ని రంగాలలో టీం ఇండియా బలంగా ఉందని , రాబోయే రోజుల్లో హ్యాట్రిక్ సాధించడం ఖాయమని పేర్కొన్నారు అజారుద్దీన్. అద్భుత విజయాన్ని అందించిన జట్టు సభ్యులందరికీ ,సిబ్బందికి కంగ్రాట్స్ తెలిపారు. వారు నిజంగా అసాధారణంగా బాగా ఆడారు. భారత జట్టు బలంగా ఉంది, బౌలింగ్ , బ్యాటింగ్ రెండింటిలోనూ లోతుగా ఉంది. వారి ఫీల్డింగ్ కూడా మెరుగు పడిందన్నారు. కొన్ని మ్యాచ్‌లలో, వారు కొన్ని అద్భుతమైన క్యాచ్‌లు తీసుకున్నారని, అలాంటి ఫీల్డింగ్ క్షణాలు పెద్ద తేడాను కలిగిస్తాయన్నారు. భారతదేశం ఇలాగే ఆడటం కొనసాగిస్తే ఇక ప్రపంచంలో ఏ జట్టు మనల్ని ఓడించడం చాలా కష్టమైన విషయం అన్నారు.
ఇదే సమయంలో కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు అజారుద్దీన్ ఇలా అన్నాడు. తను భారతదేశంలోని ప్రజలు లేదా జట్టును ఎంపిక చేసే వారి అంచనాలకు అనుగుణంగా రాణించలేదు. కానీ ఇప్పుడు, అతను చాలా పరిణతి చెందాడు. పరుగులు చేయడానికి వికెట్ వద్ద ఉండాల్సిందే, లేకపోతే మీరు స్కోరు చేయలేరు అని అర్థం చేసుకోవడానికి అతనికి సమయం పట్టిందన్నాడు. గత మూడు మ్యాచ్ లలో శాంసన్ అసాధారణమైన రీతిలో ఆడాడు. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా చేశాడు. తనలో అద్భుతమైన టాలెంట్ దాగి ఉందన్నాడు. ఇది ఇండియాకు మరింత బలం చేకూర్చుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.


















