హైదరాబాద్ : తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ముగింపు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ మట్టికి గొప్ప చైతన్యం ఉందన్నారు. జల్, జంగిల్, జమీన్ అని కొమురం భీమ్ పోరాడిన గడ్డ ఇదన్నారు. భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో ఎంతో మంది నేలకొరిగారని పేర్కొన్నారు ఎ. రేవంత్ రెడ్డి. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం తెలంగాణ ఎదురు చూస్తోందని చెప్పారు. తెలంగా ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందించేందుకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను తీసుకొచ్చామని ప్రకటించారు .
2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ ను రూపొందించడం జరిగిందని చెప్పారు అనుముల రేవంత్ రెడ్డి. ఇది నాలుగు గోడల మధ్య కూర్చుని తయారు చేసింది కాదని అన్నారు. నాలుగు కోట్ల ప్రజల అభిప్రాయాలు తీసుకుని తయారు చేసినట్లు తెలిపారు. ఆనాడు ఎడ్యుకేషన్, ఇరిగేషన్ కు జవహర్ లాల్ నెహ్రూ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు మేం ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్ నినాదంతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు . పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, యువతకు ఉపాధి అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు సీఎం.
















