చెరువులు ముమ్మాటికీ ప్ర‌జ‌ల సొత్తు – క‌మిష‌న‌ర్

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన రంగ‌నాథ్

hellotelugu-HYDRAA

హైద‌రాబాద్ : ప్రైవేటు ప‌ట్టానా.. స‌ర్కారీ ప‌ట్టానా అనేది లేకుండా.. చెరువుల‌న్నీ ప్ర‌జ‌ల సొత్త‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప్ర‌క‌టించారు. నీరు త‌గ్గిన‌ప్పుడు చెరువుల చెంత వ్య‌వ‌సాం చేసుకోడానికే అనుమ‌తులు ఉన్నాయ‌ని చెప్పారు. ఇవాళ క‌మిష‌న‌ర్ మీడియాతో మాట్లాడారు. చెరువు స్వ‌రూపాన్ని మార్చ‌డానికి వీలు లేద‌ని స్ప‌ష్టం చేశారు. అక్క‌డ నిర్మాణాలు చేప‌డ‌తామంటే కుద‌ర‌ద‌న్నారు. కొన్ని చోట్ల గేటెడ్ క‌మ్యూనిటీలు చెరువుకు వెళ్లే అవ‌కాశం లేకుండా చేస్తున్నాయ‌నే ఫిర్యాదుల‌కు హైడ్రా క‌మిష‌న‌ర్ ఈ వివ‌ర‌ణ ఇచ్చారు. మొద‌టి విడ‌తగా ఆరు చెరువుల‌ను పున‌రుద్ధ‌రిస్తున్నామ‌ని తెలిపారు. ఇందులో ఇప్ప‌టికే మూడింటిని ప్రారంభించామ‌న్నారు. రెండో విడ‌త‌గా 14 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌ను చేప‌డుతున్నామ‌ని.. మ‌రో 4 పెద్ద చెరువుల‌ను కూడా చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింద‌ని తెలిపారు.

చెరువుల చెంత నివాసాలు కోల్పోయిన పేద వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని చెప్పారు రంగ‌నాథ్. మాధాపూర్‌లోని సున్నం చెరువు, ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని రామంతాపూర్ చెరువులో నివాసాలు కోల్పోయిన పేద‌ల‌కు ఇదే విష‌యాన్ని చెప్పామ‌న్నారు. న‌గ‌రంలో వంద‌ల సంఖ్య‌లో ఉన్న చెరువుల‌న్నిటినీ గుర్తించి సీఎస్ ఆర్ ( కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ) ఫండ్స్‌తో అభివృద్ధి చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంద‌ని.. ఈ దిశ‌గా హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని అన్నారు. హైడ్రా ఇప్ప‌టి వ‌ర‌కూ 2093 ఎక‌రాలను స్వాధీనం చేసుకుంద‌ని తెలిపారు. చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఉన్న ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి 296.12 ఎక‌రాలు, నాలాల చెంత 24.05 ఎక‌రాలు, ప్ర‌భుత్వ భూములు 1606.34 ఎక‌రాలు, పార్కుల ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి 92.24 ఎక‌రాలు స్వాధీనం చేసుకున్న‌ట్టు చెప్పారు.

Exit mobile version