డ్ర‌గ్స్ ర‌హిత రాష్ట్రంగా త‌మిళ‌నాడు కావాలి

పిలుపునిచ్చిన బీజేపీ మాజీ చీఫ్ అన్నామ‌లై

hellotelugu-KAnnamali

చెన్నై : ఈ దేశంలో మాద‌క ద్ర‌వ్యాల వినియోగం ఎక్కువ కావ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు తమిళ‌నాడు బీజేపీ మాజీ అధ్య‌క్షుడు కె. అన్నామ‌లై. తన ‘డ్రగ్-ఫ్రీ’ (మాదకద్రవ్య రహిత) ప్రచారంలో భాగంగా అన్నామలై ఆదివారం కోయంబత్తూరు సమీపంలోని పొల్లాచిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. త‌న‌ సన్నిహితుడైన అమర్ ప్రసాద్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. మాదక ద్రవ్యాల సమస్య అనేది కేవలం తమిళనాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్య అని అన్నారు. మాదక ద్రవ్యాల కారణంగా విద్యార్థులు కుంగుబాటుకు (డిప్రెషన్) గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. వారు దీనికి తీవ్రంగా బానిసలవుతున్నారు, దీనివల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే ‘తలైవర్’ అన్నామలై ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

ఈ జూలై నెలను డ్రగ్-ఫ్రీ మంత్ గా ప్రకటించారు. కాబట్టి మనమందరం తెల్లని బ్యాండ్ ధరించాలి అని రెడ్డి చెప్పారు. అంతే కాకుండా, మాదకద్రవ్యాల వ్యాప్తి దేశానికి, రాష్ట్రానికి అతిపెద్ద ముప్పుగా మారిందని ఆయన ఆరోపించారు. అన్నామలై పొల్లాచిలో జరగనున్న ఈ సభలో ప్రసంగించడం వ‌ల్ల ఎంతో మంది దీనికి దూరంగా ఉంటార‌ని తాము భావిస్తున్నామ‌ని చెప్పారు. ఇందులో ఎటువంటి రాజకీయాలు ఉండవు, కేవలం సామాజిక అంశాలే ఉంటాయన్నారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత అన్నామలై పాల్గొంటున్న మొదటి పెద్ద బహిరంగ కార్యక్రమం ఇదే కావ‌డం విశేషం. అన్నామలై ‘వీ ది లీడర్స్ ఫౌండేషన్’ కు నాయకత్వం వహిస్తున్నారు. ఈ సంస్థ ప్రస్తుతం సభ్యులను చేర్చుకోవడంతో పాటు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది.

Exit mobile version