హైదరాబాద్ : కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంతో సీఎం రేవంత్ రడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ ఇద్దరి మధ్య రహస్య అవగాహన ఒప్పందం కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ఒకరిపై మరొకరు తింటుకున్నట్లు డ్రామాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. ఆదివారం జి. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ కుటుంబం నుండి రూ. లక్ష కోట్లు వసూలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారని, కానీ ఆ హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ , ఇతర ప్రాజెక్టులలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ నేత ప్రశ్నించారు.
అవినీతిపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి దర్యాప్తు సంస్థలు లేవా లేక ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ఈ విషయంలో మౌనంగా ఉందా అని కిషన్ రెడ్డి నిలదీశారు. బీజేపీ ఎంపీలు , ప్రజాప్రతినిధులను విమర్శించే ముందు ముఖ్యమంత్రి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గట్టేందుకు తాను రెండు రోజుల పాటు ‘సింగరేణి భరోసా యాత్ర’ను చేపడతానని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ యాత్రలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు పాల్గొంటారని తెలిపారు. అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గంలో వర్షాకాలం కారణంగా రోడ్లు గుంతలమయంగా మారాయని, వీధి దీపాలు వెలగడం లేదని ప్రజలు ఫిర్యాదు చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితి గురించి సంబంధిత అధికారులకు సమాచారం అందించినప్పటికీ, వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు.
