అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. తిరుమల అలిపిరి కాలినడక మార్గంలోని దొరసాని మండపం సమీపంలో చిరుతపులి సంచారంపై నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని అదేశించారు. భక్తుల ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మెట్ల మార్గంలో చిరుత సంచారం అంశాన్ని కార్యాలయ అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. యాత్రికుల భద్రత కోసం అటవీశాఖ, టీటీడీ అటవీ విభాగం, టీటీడీ విజిలెన్స్ విభాగాల సమన్వయంతో తీసుకుంటున్న చర్యలను వివరించారు.
హనుమాన్(H.A.N.U.M.A.N.) బృందాలను కూడా అప్రమత్తం చేసినట్టు తెలిపారు డిప్యూటీ సీఎంకు. చిరుత సంచారం నేపథ్యంలో భక్తుల భద్రతకు భంగం వాటిల్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ధేశించారు. భక్తులను నిరంతరం అప్రమత్తం చేయాలని ఆదేశించారు. సున్నితమైన ప్రాంతాల్లో దట్టమైన పొదలను తొలగించి వ్యూలైన్స్ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. భక్తులు గుంపులు గుంపులుగా మాత్రమే వెళ్లేలా ముందస్తు అవగాహన కల్పించాలని చెప్పారు. చిరుత సంచారం వార్తల పట్ల భక్తులు ఆందోళనకు గురికాకుండా భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇదిలా ఉండగా ఇప్పటికే టీటీడి విజిలెన్స్ విభాగం అప్రమత్తమైంది. ఈ మేరకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దీనిపై సమీక్ష చేపట్టారు టీటీడీ ఉన్నతాధికారులు.
















