హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ దూకుడు పెంచింది. మొన్నటికి మొన్న ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ ఇళ్లపై దాడులు చేసింది. రూ. 200 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది. ఇవాళ మరో అవినీతి తిమింగలం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. హైదరాబాద్ లోని నారాయణగూడ సర్వే భవన్ లో డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్న నరహరి అవినీతి అక్రమాలపై ఉక్కు పాదం మోపింది. ఏసీబీ ఆధ్వర్యంలో పదకొండు చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో భారీగా నగదు ఆభరణాలు.. స్థిరాస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనధికార అంచనా ప్రకారం ఇప్పటికే రూ. 50 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించినట్లు సమాచారం. అయితే సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉండగా నరహరి సర్వే ల్యాండ్ రికార్డ్స్ మల్టీ జోన్ – 2 డిప్యూటీ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్నారు. గత కొంత కాలంగా తనపై అనేక అవినీతి ఆరోపణలు చోటు చేసుకున్నాయి.
ప్రతీ ల్యాండ్ రికార్డ్స్ విషయంలో క్రింది స్థాయి సిబ్బందితో కలిసి డబ్బులు వసూలు చేస్తున్నట్లు బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలో ఛత్రినాక లోని నరహరి నివాసం.. నారాయణగూడ సర్వే భవన్ లో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతానికి రూ. 32 లక్షల నగదు లభ్యమైనట్లు సమాచారం. ఇదే సమయంలో నరహరి బంధువులు, సన్నిహితులకు సంబంధించిన ఆస్తుల వద్ద ఈ దాడులు జరిగాయి. రూ. కోటి నగదుతో పాటు, అనేక ఆస్తులకు సంబంధించిన పత్రాలు , భారీ మొత్తంలో ఉన్న బ్యాంక్ డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నోట్ల కట్టలను లెక్కించడానికి కరెన్సీ లెక్కింపు యంత్రాలను, అలాగే బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను తూకం వేయడానికి తూకం యంత్రాలను ఏసీబీ అధికారులు ఉపయోగించారు.
ఈ సోదాలు, వాటిలో వెలుగు చూసిన వివరాలపై ఏసీబీ ఒక సమగ్ర ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
















