న్యూఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రధానంగా బాల కార్మికుల అంశానికి సంబంధించి స్పందించింది. వినోద రంగంలో బాల కార్మికులపై కఠినమైన నిషేధం కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రం స్పందన తెలియ చేయాలని సుప్రీంకోర్టు కోరింది. వినోద, ఆతిథ్య రంగాలకు సంబంధించిన సంస్థలలో బాల కార్మికులపై కఠినమైన నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై భారత సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.
ఆర్కెస్ట్రాలు, డాన్స్ బార్‌లు, నృత్య బృందాలు, నౌటంకి ప్రదర్శనలు, మసాజ్ పార్లర్‌లు, స్పాలు, సెలూన్‌ల వంటి ప్రదేశాలలో పిల్లలపై జరుగుతున్న దోపిడీపై ఈ పిటిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి రంగాలలో మైనర్లపై దుర్వినియోగం, అక్రమ రవాణాను నివారించడానికి పటిష్టమైన రక్షణ చర్యలు, పర్యవేక్షణ యంత్రాంగాలను అమలు చేయాలని కేంద్రాన్ని కోరింది.పిటిషన్ ప్రకారం, ఈ సంస్థలలో పనిచేస్తున్న పిల్లలు శారీరక, మానసిక, ఆర్థిక దోపిడీకి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. దేశ వ్యాప్తంగా బాలల రక్షణ, కార్మిక చట్టాలను కఠినంగా అమలు చేసేలా చూడటానికి తక్షణమే జోక్యం చేసుకోవాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఈ విషయంపై ఇవాళ పెద్ద ఎత్తున వాదోప వాదనలు చోటు చేసుకున్నాయి. తమ స్పందనను తెలియ జేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
