అమరావతి : నేతన్నలకు తీపి కబురు చెప్పింది ఏపీ కూటమి సర్కార్. నేటితరం అభిరుచులను దృష్టిలో పెట్టుకుని, చేనేత రెడీమెడీ వస్త్రాలను అమ్మకాలు చేస్తున్నామని వెల్లడించారు రాష్ట్ర బీసీ, సంక్షేమ, చేనేత శాఖ మంత్రి ఎస్. సవిత. ఇందుకు అవసరమైన శిక్షణను నేతన్నలకు అందజేస్తున్నామని చెప్పారు. నేత కార్మికులకు ఆర్థిక భరోసా కలిగించేలా డైయింగ్, బ్లీచింగ్ ఛార్జీలు, టవల్స్, ఇతర వస్త్రాల నేత ఛార్జీలు పెంచామన్నారు. త్వరలో నేతన్న భరోసా పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే ప్రారంభమైందని మంత్రి సవిత వెల్లడించారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ, ఆప్కో బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రెడీమేడ్ వస్త్రాల తయారీపై చేనేతలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
అనంతరం తనను కలిసిన విలేకరులతో మంత్రి సవిత మాట్లాడారు. ,2014-19లో సీఎం చంద్రబాబు నాయుడు పాలన చేనేత రంగానికి స్వర్ణయుగం లాంటిందన్నారు. తరవాత వచ్చిన జగన్ …అన్ని వ్యవస్థల మాదిరిగానే చేనేత రంగాన్ని భ్రష్టు పట్టించారన్నారు. ఆప్కో పేరు మీద తీసుకొచ్చిన రూ.100 కోట్లను జగన్ పక్కదారి పట్టించారన్నారు. ఇప్పుడు ఆ బకాయి భారం ఆప్కోపై పడిందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా చేనేత సహకార సంఘాల కొనుగోలు చేసిన వస్త్రాలకు నగదు చెల్లిస్తున్నామన్నారు. ఈ నెల 15న సంక్షేమ హాస్టళ్లకు అందజేసిన దుప్పట్లు, ఇతర వస్త్రాలకు చెందిన రూ.4 కోట్ల బకాయిలను చెల్లించనున్నామని తెలిపారు.
