అమరావతి : అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2026–27 సంవత్సరానికి సంబంధించిన తొలివిడత సాయాన్ని ప్రభుత్వం శనివారం విడుదల చేయనుంది. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. వీరిలో 45,69,817 మంది భూ యజమాని రైతులు కాగా, 1,16,021 మంది అటవీ హక్కుల చట్టం కింద సాగు చేస్తోన్న RoFR రైతు కుటుంబాలు ఉన్నాయి. రూ.3,125.47 కోట్లను రేపు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,342.92 కోట్లు కాగా కేంద్ర ప్రభుత్వ వాటా రూ.782.55 కోట్లుగా ఉంది. గతేడాది ఈ పథకానికి రూ.8,985.41 కోట్లు ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.6,560.18 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2425.23 కోట్లు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అమలవుతోన్న ఈ పథకంతో అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రూ.6 వేలు సమకూరుస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేస్తున్నారు. ఈ ఏడాది తొలి విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, పీఎం కిసాన్ కింద కేంద్రం రూ.2 వేలు కలిపి ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేలు జమ చేయనున్నాయి.

















