హైదరాబాద్ : ఎల్ నినో దెబ్బకు హైదరాబాద్ నగరం నీటి కష్టాలను ఎదుర్కొంటోంది. ఇంకా ఎండా కాలం రానే లేదు. ఇప్పుడే తాగు నీళ్లందక ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. దీనిని ముందే గమనించింది జల మండలి. ఈ మేరకు తాగు నీళ్లను పొదుపుగా వాడుకోవాలని ఇప్పటికే పలుమార్లు సూచించింది. అయినా కొందరు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ నీటిని వృధా చేస్తుండడంతో వారికి జరిమానా విధించింది. త్రాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు వాటర్ బోర్డు కఠిన చర్యలు చేపడుతోంది. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిశీలించి క్షేత్రస్థాయిలో ఉల్లంఘనలు జరిగినట్లు నిర్ధారణ అయిన పక్షంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో త్రాగునీటిని వృథా చేసిన ఒక వ్యక్తికి రూ. 5,000 జరిమానా విధించింది.
జూబ్లీహిల్స్ సర్కిల్ , వార్డు పరిధిలోని రోడ్ నం. 57, ప్లాట్ నం. 1152 వద్ద త్రాగునీటిని ప్రాంగణాల శుభ్రత కోసం ఉపయోగిస్తున్నారని స్థానికులు వాటర్ బోర్డు వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన వాటర్ బోర్డు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. అక్కడ త్రాగునీటిని దుర్వినియోగం చేస్తున్నట్లు నిర్ధారించుకున్న అధికారులు, సంబంధిత వ్యక్తికి జరిమానా విధించారు. ఫిర్యాదు స్వీకరణ, క్షేత్రస్థాయి విచారణ, ఉల్లంఘన నిర్ధారణ , జరిమానా విధింపు వంటి చర్యల ద్వారా, త్రాగునీటి దుర్వినియోగాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదని వాటర్ బోర్డు స్పష్టం చేసింది. త్రాగునీటిని కేవలం తాగడానికి , గృహ అవసరాలకు మాత్రమే పొదుపుగా వాడుకోవాలని సూచించింది. ఇంటి పరిసరాలను లేదా రోడ్లను శుభ్రం చేయడానికి త్రాగునీటిని వృథా చేస్తే, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఎక్కడైనా త్రాగునీటిని వృథా చేయడం లేదా దుర్వినియోగం చేయడం గమనిస్తే సంబంధిత ఫోటోలు, వీడియోలు, వ్యక్తులు లేదా సంస్థల వివరాలు, సంఘటన జరిగిన ప్రదేశం, పూర్తి చిరునామాతో వాటర్ బోర్డు వాట్సాప్ నంబర్ ‘99499 30003’కు సమాచారం అందించాలని ప్రజలను కోరింది. అలాగే కస్టమర్ కేర్ నంబర్ ‘155313’ ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని తెలిపింది. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును పరిశీలిస్తామని, అవసరమైన క్షేత్రస్థాయి విచారణ చేపడతామని, ఉల్లంఘనలు జరిగినట్లు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వాటర్ బోర్డు స్పష్టం చేసింది. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది.


















