తిరుపతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా అస్సాం ప్రభుత్వం కేటాయించిన 10.33 ఎకరాల భూమిని టీటీడీ అధికారికంగా స్వాధీనం చేసుకుంది. అస్సాం రాష్ట్రంలోని కామ్రూప్ జిల్లాలోని సోనాపూర్ సర్కిల్ పరిధిలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం కోసం ఈ భూమిని అస్సాం ప్రభుత్వం కేటాయించింది. గతంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఉన్నతాధికారులు అస్సాం ప్రభుత్వ ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపి ఆలయ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టారు. అలాగే ముఖ్యమంత్రి , టీటీడీ పాలకమండలి కూడా అస్సాం ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖలు రాశారు.
ఈ నేపథ్యంలో టీటీడీ ఎస్టేట్ అధికారి సువర్ణమ్మ, ఈఈ సురేంద్ర రెడ్డికి అస్సాం మెట్రోపాలిటన్ డిప్యూటీ కమిషనర్ ల్యాండ్ పొజెషన్ సర్టిఫికెట్‌ను అందజేశారు. గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి త్వరలో భూమి పూజ నిర్వహించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో ఈ ప్రక్రియ వేగవంతమై సఫలమవడం ఆనంద దాయకమన్నారు. అస్సాంలో శ్రీవారి ఆలయ నిర్మాణం ఈశాన్య భారతంలో సనాతన ధర్మ ప్రచారానికి, ఆధ్యాత్మిక చైతన్య విస్తరణకు ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుందని పేర్కొన్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి సహకరించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకి, అస్సాం ప్రభుత్వానికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర టీటీడీ తరఫున కృతజ్ఞతలు తెలియ జేశారు.


















