పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి : అనిత

పాఠశాల స్థాయి నుండే అవగాహన కల్పించాలి

hellotelugu-AnithaVangalapudi

అనకాపల్లి : స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని , పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. కశింకోట మండలం తేగాడ మోడల్ పాఠశాలలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పారిశుద్య సిబ్బందిని సన్మానించారు. పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో హోం మంత్రి అనిత మాట్లాడారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెల రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గంలో పాల్గొంటున్నారని అన్నారు. ప్రతిచోట మంత్రులు, శాసనసభ్యులను కూడా భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు మరుగుదొడ్డి వినియోగించాలని, మరుగుదొడ్డి లేనిచోట్ల మరుగుదొడ్డి నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్ప‌ష్టం చేశారు.

గ‌తంలో ఏపీలో పాల‌న సాగించిన వైసీపీ జ‌గ‌న్ రెడ్డి రాష్ట్రాన్ని స‌ర్వ నాశనం చేశాడ‌ని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అందుకే ప్ర‌జ‌లు కేవ‌లం 11 సీట్ల‌కే ప‌రిమితం చేశార‌ని మండిప‌డ్డారు. అయినా జ‌గ‌న్ రెడ్డికి బుద్ది రావ‌డం లేద‌న్నారు. నిర్వీర్యం చేసిన వ్య‌వ‌స్థ‌ల‌ను అన్నింటిని ప్ర‌స్తుతం స‌మ‌ర‌వంతుడైన నాయ‌కుడు, ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలో బాగు చేయ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు అనిత వంగ‌ల‌పూడి.

Exit mobile version