తిరుపతి : తిరుపతి నగరానికి అతి సమీపంలో ఉన్న అప్పలాయగుంట ఆలయంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చారు. ఉత్సవాలలో భాగంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు రాత్రి కల్కి అలంకారంలో అశ్వ వాహనంపై స్వామి వారు విహరించి భక్తులను అనుగ్రహించారు .మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణ యజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వ వాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలి దోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు. ఈ వాహన సేవలో ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయ ప్రసాలకోర్చి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేశారు.



















