తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మ వారిని మేల్కొలిపి సహస్ర నామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు.
రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మ వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆ తరువాత మహా పూర్ణాహుతితో అమ్మ వారి వసంతోత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్లు సురేష్, శ్రీ ముని చెంగల్రాయులు, రమేష్ టెంపుల్ ఇన్‌స్పెక్టర్ చలపతి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సుదూర ప్రాంతాల నుంచి శ్రీ పద్మావతి అమ్మ వారిని దర్శించుకునేందుకు భారీ ఎత్తున తరలి వచ్చారు భక్త బాంధవులు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ) భారీ ఏర్పాట్లు చేసింది.
ఇదిలా ఉండగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆధ్వర్యంలోని అనుబంధ ఆలయాలలో తప్పనిసరిగా అన్నదానం నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ఇటీవలే సీతా రాముల కళ్యాణోత్సవం పురస్కరించుకుని ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో అన్నదానం చేపట్టారు.
