తిరుపతి : తిరుపతి లోని శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం పుష్ప యాగం ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు పుణ్యాహ వచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం చేపట్టారు. మార్చి 15న ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పుష్పయాగం అంగరంగ వైభవంగా చేపట్టారు.
ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఇదిలా ఉండగా బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకులు, అధికార అనధికారులు, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తొలగి పోతాయని విశ్వాసం . కాగా శ్రీవారి పుష్ప యాగాన్ని పురస్కరించుకుని ఇవాళ నిర్వహించనున్న నిత్య కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ శ్రీమతి వరలక్ష్మి, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు ముని శంకర్, ధనశేఖర్ పాల్గొన్నారు.



















