తిరుపతి : తిరుపతి లోని శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం శ్రీ గోవింద రాజస్వామి వారు సింహ వాహనంపై అభయ హస్తంతో భక్తులను అనుగ్రహించారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరిగిన ఈ దివ్య వాహన సేవలో మంగళ వాయిద్యాలు, కోలాటాలు, వేదఘోషలు, గోవింద నామ స్మరణలతో తిరుపతి మాడవీధులు ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడాయి. వాహనం ముందు ఠీవిగా సాగిన గజరాజులు సేవకు మరింత మహోత్సవ శోభను చేకూర్చాయి. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు.
మృగరాజైన సింహం గాంభీర్యానికి, ధైర్యానికి, శక్తికి ప్రతీకగా భావించ బడుతుంది. యోగ శాస్త్రంలో సింహం వేగశక్తికి, ఆత్మ విశ్వాసానికి సంకేతం. భక్తునిలో సింహ బలం లాంటి అచంచల భక్తి కలిగినప్పుడు భగవంతుని కృప ప్రసాదమవుతుందని ఆధ్యాత్మిక వాంగ్మయం తెలియ జేస్తోంది. అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు రాక్షసుల హృదయాల్లో సింహ స్వరూపుడిగా ప్రత్యక్షమవుతాడని పురాణాలు కీర్తిస్తున్నాయి. అందుకే ధీరోదాత్తుడైన శ్రీహరి సింహ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిస్తాడు.
అనంతరం ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్వామి వారు, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించి విశేష పూజలు సమర్పించారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ జరగనుండగా, రాత్రి 7 నుండి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై శ్రీ గోవింద రాజస్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
