తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) సంచలన ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో దారం కనిపించిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఈ మేరకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. టీటీడీ ప్రతిరోజూ శ్రీ వైష్ణవ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అత్యంత పవిత్రతతో, పరిశుభ్రతా ప్రమాణాలను పాటిస్తూ భారీ స్థాయిలో తయారు చేసి భక్తులకు అందిస్తోందని స్పష్టం చేసింది.
లడ్డూ తయారీకి వినియోగించే ముడి పదార్థాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంగ్రిడియెంట్ సార్టింగ్ మిషన్ ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో తనిఖీ చేయడం జరుగుతోందని పేర్కొంది టీటీడీ. ముడి పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలోనూ టీటీడీ కఠినమైన ప్రమాణాలను పాటిస్తోందని వెల్లడించింది. ఈ విధానంలో లడ్డూ తయారీలో వేరే పదార్థాలు కలిసేందుకు అవకాశమే ఉండదని పేర్కొంది. భక్తులకు అందించే ప్రతి ప్రసాదం నాణ్యతగా ఉండేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని ప్రకటించింది.
అయితే, కొందరు వ్యక్తులు టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో స్వామివారి పవిత్ర లడ్డూ ప్రసాదంపై భక్తుల్లో అపోహలు కలిగించేలా నిర్ధారణ లేని వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం సరికాదని పేర్కొంది. శ్రీవారి ప్రసాదం విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులు ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయకుండా, ఏదైనా అనుమానాస్పద విషయం కనిపిస్తే వెంటనే టీటీడీ అధికారుల దృష్టికి తీసుకు రావాలని కోరింది.
