హైదరాబాద్ : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టులో చేపట్టిన మంచాల, వంగూరు , పోల్కంపల్లి పబ్లిక్ పాఠశాలల పనులను ప్రతి బుధవారం ప్రత్యేకంగా పర్యవేక్షించి వాటిని వేగవంతం చేయాలని విద్యా కమిషన్ నిర్ణయించింది. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకు రావాలనే లక్ష్యంతో ఈ సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, కమిషన్ సభ్యులు డాక్టర్ చారకొండ వెంకటేష్, జోష్నా శివారెడ్డి, ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వర్ రావు, విద్యా మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఎండీ గణపతి రెడ్డి పాల్గొన్నారు. అలాగే అరుట్ల, వంగూరు, పోల్కంపల్లి , మంచాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కాంట్రాక్టర్లు కూడా హాజరయ్యారు. ఆ మూడు పాఠశాలల్లో జరుగుతున్న నిర్మాణ పనులు, నిధుల విడుదల, కనీస సదుపాయాలు, ఫర్నిచర్ , ఇతర అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు.
మంచాల, వంగూరు మరియు పోల్కంపల్లి పాఠశాలల్లో పూర్తయిన పనులు, ప్రస్తుతం జరుగుతున్న పనులు , ఇంకా చేపట్టాల్సిన పనులపై సమీక్ష నిర్వహించారు. కొన్ని పనులకు సంబంధించిన నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యంపై కూడా చర్చలు జరిగాయి. నిధుల సమస్యల వల్ల పనులు ఆగిపోకుండా ఉండేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టులోని మూడు పాఠశాలల్లో మిగిలి ఉన్న పనులను వేగవంతం చేసి, డిసెంబర్ గడువులోగా పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన కనీస సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.
పాఠశాలలకు అవసరమైన ఫర్నిచర్‌ను జైళ్ల శాఖ నుండి సమకూర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లలో ఖైదీలు తయారు చేసిన ఫర్నిచర్‌ను వినియోగించుకోవాలి. ఈ మేరకు, ప్రతి పాఠశాలకు అవసరమైన ఫర్నిచర్ వివరాలతో కూడిన పూర్తి స్థాయి ఇండెంట్‌ను సిద్ధం చేయాలని ప్రధానోపాధ్యాయులను నవీన్ నికోలస్ ఆదేశించారు. విద్యార్థుల సంఖ్య, తరగతి గదుల అవసరాలకు అనుగుణంగా డెస్కులు, బెంచీలు, టేబుళ్లు, కుర్చీలు, ఇతర ఫర్నిచర్ అవసరాలను ముందుగానే గుర్తించి, ఇండెంట్ సిద్ధం చేసుకోవాలని నికోలస్ అన్నారు.
తెలంగాణ విద్యా, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ ఎండీ గణపతి రెడ్డి మాట్లాడుతూ ఈ మూడు టీపీఎస్‌లలో ఇప్పటి వరకు పూర్తయిన పనులకు సంబంధించిన మెజర్‌మెంట్ బుక్స్ రిజిస్ట్రేషన్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తామని అన్నారు. పనుల కొలతలు, రికార్డుల నిర్వహణ, బిల్లుల ప్రాసెసింగ్ వంటి ఇతర విషయాలను సమన్వయంతో చూసుకుంటామని తెలిపారు.
















