అమరావతి : రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ‘జలధార – జలహారతి’ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు సీఎం. ‘ఎల్ నినో’ (El Niño) ప్రభావం అంచనాలను మించి ఉన్నందున, నీటి వనరుల సంరక్షణ, తాగునీటి సరఫరా , పంటల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. అలాగే ‘జలధార – జలహారతి’ కార్యక్రమాన్ని నిరంతరాయంగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమం కింద మొత్తం 82,865 పనులను గుర్తించగా, రూ. 3,409.35 కోట్ల విలువైన పనులకు ఆమోదం లభించిందని చెప్పారు.
వీటిలో ఇప్పటికే 79,826 పనులు పూర్తయ్యాయని వెల్లడించారు సీఎం. చెరువుల పూడికతీత, ఫీడర్ కాలువలు, వ్యవసాయ కుంటలు , కందకాల తవ్వకం వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. తాగునీటి అవసరాల కోసం వెలుగోడు, గొరకల్లు, ఆవుకు, జీడిపల్లి, చెర్లోపల్లి తదితర జలాశయాలలో నీటిని నిల్వ చేయాలని ఆదేశించారు. అలాగే నాగార్జున సాగర్ కాలువల ద్వారా వివిధ జిల్లాల తాగునీటి అవసరాలకు అనుగుణంగా నీటి కేటాయింపులను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. ఈ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, నీటిపారుదల, వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులు, అలాగే వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
