తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ( టీటీడీ) కీలక ప్రకటన చేసింది. టీటీడీ ఆధ్వర్యంలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు, సేవలు ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. సెప్టెంబరు 4, 11, 18, 25వ తేదీల్లో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. 22న ఉత్తరాషాఢ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు శ్రీ పద్మావతి అమ్మ వారు గజవాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
శ్రీ బలరామకృష్ణస్వామి ఆలయంలో సెప్టెంబరు 4న రోహిణి నక్షత్రం సందర్భంగా రాత్రి 7 గంటలకు శ్రీ కృష్ణ స్వామివారికి తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు. శ్రీ సుందరరాజస్వామి ఆలయంలో సెప్టెంబరు 27న ఉత్తరాభాద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సుందర రాజ స్వామివారు తిరుచ్చి వాహనంపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీ సూర్య నారాయణ స్వామి ఆలయంలో సెప్టెంబరు 13న హస్తా నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు శ్రీ సూర్య నారాయణ స్వామివారు తిరుచ్చి వాహనంపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
తిరుచానూరు శ్రీనివాస ఆలయంలో సెప్టెంబరు 5, 12, 19, 26వ తేదీల్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి మూలవర్లకు విశేషంగా అభిషేకం నిర్వహించనున్నారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సెప్టెంబరు 1న ఉదయం 8 గంటలకు అష్టదళ పాద పద్మారాధన సేవ నిర్వహించనున్నారు. సెప్టెంబరు 4, 11, 18, 25వ తేదీల్లో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 9న ఉదయం 8 గంటలకు అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించనున్నారు.
సెప్టెంబరు 23న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. 6, 13, 20, 27వ తేదీల్లో ఉదయం 8.15 గంటలకు శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారికి అభిషేకం నిర్వహించనున్నారు.



















