న్యూఢిల్లీ : కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే దేశంలో
ఉగ్రవాద వ్యతిరేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇందుకు సంబంధించి వేగవంతమైన పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు రెడీ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం, రాజస్థాన్, పాట్నా , ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో సంప్రదింపులు జరిపింది. జైపూర్, పాట్నా . విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులను వరుసగా ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులుగా ప్రకటించింది. సంబంధిత హైకోర్టుల సంప్రదింపులతో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ , బీహార్ రాష్ట్రాల కోసం ప్రభుత్వం మూడు కొత్త ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చట్టం, 2008 (2008లో 34వ చట్టం)లోని సెక్షన్ 11 ద్వారా సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్, పాట్నా , ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో సంప్రదింపులు జరిపింది.
హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఈ కోర్టులు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేసిన ‘షెడ్యూల్డ్ నేరాల’ విచారణకు మాత్రమే ప్రత్యేకంగా పని చేస్తాయి . ‘చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా) కు సంబంధించిన అంశాలపై రాష్ట్రాల వారీగా అధికార పరిధిని కలిగి ఉంటాయి. విచారణ వేగంగా జరిగేలా చూసేందుకు ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో ఒక ప్రత్యేక ఎన్ఐఏ కోర్టును, అలాగే ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద 10కి పైగా కేసులు ఉన్న చోట ఒకటి కంటే ఎక్కువ కోర్టులను ఏర్పాటు చేస్తామని కేంద్రం 2025 డిసెంబర్ 16న సుప్రీంకోర్టుకు తెలిపింది. ఫిబ్రవరిలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేసిన 10 లేదా అంతకంటే ఎక్కువ కేసులు విచారణ దశలో ఉన్న రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు సమగ్ర నివేదికను సమర్పించింది. హోం మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, ప్రతి ప్రత్యేక కోర్టుకు సంబంధించి, పునరావృతం కాని ఖర్చుల కోసం ఒకసారి రూ. కోటి గ్రాంట్‌ను, నిర్వహణ వంటి పునరావృత ఖర్చుల కోసం ఏటా రూ. కోటిని కేంద్రం సమకూరుస్తుంది. ఈ నిధులు మౌలిక సదుపాయాల పునరుద్ధరణ, ఐటీ పరికరాలు, వాహనాలు, సిబ్బంది వేతనాలకు ఉపయోగ పడతాయని ఆ నివేదిక పేర్కొంది.















