అమరావతి : ఏపీలలో 40 లక్షల ఇళ్లకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తామని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ప్రతీ ఇంటి పైనా విద్యుత్ ఉత్పత్తి కోసం పీఎం సూర్యఘర్ కింద సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అటు రైతులు కూడా పీఎం కుసుమ్ కింద సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాం అన్నారు. ఎక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్ అక్కడే వాడుకునే పరిస్థితి ఉంటే ట్రాన్స్ మిషన్ నష్టాలు కూడా ఉండబోవు అని పేర్కొన్నారు. గత పాలకులు వేసిన ట్రూ ఆప్ ఛార్జీలను ట్రూ డౌన్ చేశాం అని తెలిపారు సీఎం. రూ.4,600 కోట్ల మేర భారాన్ని కూడా ప్రజలపై మోపకుండా ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు. రూ.15,795 కోట్లు ఛార్జీల భారం పెంచకుండా ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నాం అన్నారు. గడచిన 22 నెలల్లో 802 ఎంయూలు చేసుకుని వాటిపై నిరంతరం సంప్రదింపులు చేస్తున్నాం అని తెలిపారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా అనుమతులు ఇస్తున్నాం అన్నారు సీఎం. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ద్వారా సుపరిపాలన అందిస్తున్నాం అని పేర్కొన్నారు.
రూ.5,400 కోట్ల పెట్టుబడులతో యశ్వంత్ సిన్హా కుమారుడు ఈ రెన్యూ ఎనర్జీ ద్వారా ప్లాంట్ పెడితే నన్ను విశ్వసించిన యువతకు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. 2019-24 మధ్య పెట్టుబడులు రావడానికి భయపడ్డారన్నారు. వేధింపులు, అవినీతి పెద్ద ఎత్తున జరిగిందని ఆరోపించారు. ఎన్డీఏ బ్రాండ్‌తో ఏపీలో విశ్వాసం తిరిగి వచ్చిందని చెప్పారు సీఎం.. పరిశ్రమలకు పెట్టుబడులకు భరోసా వచ్చిందన్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం ఎవరూ బయటకు వెళ్లాల్సిన అవసరమే లేదన్నారు. 2024లో వేసిన ఒక్క ఓటుతో ప్రజల్లో అభద్రత, ఆందోళనను తొలగించాం అన్నారు సీఎం.
