దుబాయ్ : భారతీయ మహిళా క్రికెటర్ స్మృతీ మంధన్నా మరోసారి తన ర్యాంకును పదిలంగా ఉంచుకున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్ లో టాప్-5లో తన స్థానాన్ని కోల్పోకుండా ఉంచుకుంది స్మృతీ మంధన్నా. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్‌లో హాంకాంగ్‌పై అద్భుతమైన 124 పరుగులు సాధించింది తను. దీంతో ర్యాంకింగ్స్ లో ఎగబాకింది. టాప్-5లో తన స్థానాన్ని మరింత పదిల పరుచుకుంది. 64 బంతుల్లో ఆమె ఆడిన ఈ ఇన్నింగ్స్ భారత్ జట్టుకు 137 పరుగుల భారీ విజయాన్ని సాధించి పెట్టింది. అంతే కాకుండా సెమీ-ఫైనల్స్‌లో స్థానాన్ని అందించడమే కాకుండా మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లలో కలిపి) అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా (మొత్తం 10,880 పరుగులు) నిలిచేలా చేసింది.
తద్వారా ఆమె భారత దేశానికి చెందిన మాజీ కెప్టెన్ హైదరాబాద్ అమ్మాయి మిథాలీ రాజ్ (10,868 పరుగులు) రికార్డును అధిగమించింది. ఈ ఇన్నింగ్స్ ఆమె కెరీర్‌లో 18వ అంతర్జాతీయ సెంచరీ కూడా కావడం విశేషం. దీనితో మహిళల అంతర్జాతీయ సెంచరీల జాబితాలో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. టి20 ర్యాంకింగ్స్‌లో భారత ఆల్-రౌండర్ దీప్తి శర్మ కూడా గణనీయమైన పురోగతిని సాధించింది. బ్యాటింగ్ , బౌలింగ్ రెండింటిలోనూ ఆమె అందించిన సహకారం కారణంగా, బౌలర్ల జాబితాలో ఆమె రెండు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకుంది. అలాగే ఆల్-రౌండర్ల జాబితాలో ఐదవ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇది ఈ టోర్నమెంట్‌లో భారత విజయానికి ఆమె ఎంత కీలకమో తెలియ జేస్తోంది. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కెప్టెన్ ఈషా ఓజా ప్రముఖ ‘అసోసియేట్ మెంబర్’ దేశాల క్రీడాకారిణులలో తన ప్రత్యేకతను చాటుతూనే ఉంది. ఆమె టి20 బ్యాటర్ల జాబితాలో 39వ స్థానానికి చేరుకోగా, ఆల్-రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-20కి చేరువలో నిలిచింది.
