అర్బన్ గవర్నెన్స్‌లో సింగపూర్ సహకారం కావాలి

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటి

hellotelugu-APCM

సింగపూర్ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సింగ‌పూర్ ప‌ర్య‌ట‌నలో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి సేద్యంతో పండించిన ఉద్యాన ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తులను దిగుమతి చేసుకునే అంశాలను పరిశీలించాలని సింగపూర్ ప్రధాన మంత్రి లారెన్స్ వాంగ్‌ను ముఖ్యమంత్రి కోరారు. సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం ఆ దేశ ప్రధాన మంత్రితో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. సింగపూర్ ప్రధాని అధికారిక నివాసంలో 30 నిముషాల సేపు ఇరువురు నేతలూ వివిధ అంశాలపై చర్చలు జరిపారు. టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహా యూనివర్సిటీల్లో పరిశోధనలకు సంబంధించి సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. సెమీ కండక్టర్ల తయారీ ఎకోసిస్టమ్, కెపాసిటి బిల్డింగ్‌లో తోడ్పాటు అందించాలని సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌కు విజ్ఞప్తి చేశారు.

అమరావతి సహా రాష్ట్రంలోని వివిధ నగర, పట్టణ ప్రాంతాల్లో అర్బన్ గవర్నెన్స్‌లోనూ సహకారం కోరుతున్నట్టు సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి సేద్యం ద్వారా పంటలు పండిస్తున్నట్టు సింగపూర్ ప్రధానికి సీఎం వివరించారు. ఏపీలోని ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను సింగపూర్ దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కోరారు. ప్రకృతి సేద్యం ద్వారా సాగైన ఉత్పత్తులకు సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నామని ఆయనకు తెలిపారు. పోర్టులు- ఎయిర్ పోర్టుల అభివృద్ధితో పాటు వివిధ అవకాశాలను అందిపుచ్చుకునేలా ఏపీ-సింగపూర్‌లు కలిసి పని చేయాలని కోరారు. ఇరువురు నేతల మధ్య జరిగిన చర్చల్లో భాగంగా అమరావతి రాజధాని నిర్మాణాల గురించి సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.

రాజధానిలో విద్యాసంస్థలు, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో చేపడుతున్న నిర్మాణాల గురించి వివ‌రించారు సీఎం పీఎంకు. అమరావతి అత్యంత నివాసయోగ్యమైన నగరాల సరసన చేరనుందని తెలిపారు. ఏపీలో ప్రజారోగ్యానికి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పాపులేషన్ మేనేజ్‌మెంట్ గురించి ముఖ్యమంత్రి వివరించారు. 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసే దిశగా ఏపీ ముందుకు వెళుతుందని సింగపూర్ ప్రధానికి తెలిపారు. అనంతరం ప్రపంచ వ్యాప్తంగా జనాభా తగ్గుదల అంశంపై ఇరువురు నేతలు కొద్ది సేపు చర్చించుకున్నారు. అందుబాటులో గృహ నిర్మాణం, శిశువులు, చిన్నారుల సంరక్షణ లాంటి చర్యలపై నేతల మధ్య చర్చ చోటు చేసుకుంది. సేవల రంగం తరహాలోనే తయారీ, సప్లై చైన్ రంగాలు కూడా భారత్‌లో విస్తృతం అవుతాయని ఇరువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Exit mobile version