నంది అవార్డులకు జ్యూరీ కమిటీలు ఏర్పాటు

వచ్చే నెలలో అట్టహాసంగా ప్రదానోత్సవం

hellotelugu-NandiAward

విజయవాడ : ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రతిష్టాత్మక నంది అవార్డుల ప్రదానోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2017 నుంచి 2025 వరకు నంది చలనచిత్ర, టెలివిజన్, నాటక అవార్డుల ఎంపిక కోసం వివిధ జ్యూరీ కమిటీలను నియమించింది. వచ్చే నెలలో విజయవాడ లేదా అమరావతిలో సినీ, టీవీ, రంగస్థల ప్రముఖుల సమక్షంలో భారీ స్థాయిలో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది.ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ పలు ఉత్తర్వులు జారీ చేశారు. అవార్డుల ఎంపికతో పాటు వేడుకల నిర్వహణ, ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ ఎండీ సభ్య కన్వీనర్‌గా నలుగురు సభ్యులతో అంతర్ శాఖా కమిటీని ఏర్పాటు చేశారు.

2017, 2018 సంవత్సరాల నంది చలనచిత్ర అవార్డుల ఎంపిక కమిటీకి సీనియర్ పాత్రికేయుడు ఎన్. సీతారామరాజు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 2019, 2020 సంవత్సరాలకు దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి, 2021, 2022 సంవత్సరాలకు ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు జ్యూరీ ఛైర్మన్లుగా వ్యవహరించనున్నారు. 2025 సంవత్సరపు చలనచిత్ర అవార్డుల ఎంపికకు కథా చిత్రాలు, జాతీయ సమైక్యతా చిత్రాలు, బాలల చిత్రాల విభాగంలో దర్శకుడు బి. గోపాల్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. డాక్యుమెంటరీలు, విద్యా విషయక చిత్రాలు, తెలుగు సినిమాపై ఉత్తమ గ్రంథం, విమర్శకుల విభాగాలకు కూడా ప్రత్యేక జ్యూరీలను నియమించారు.

2017 నుంచి 2024 వరకు టెలివిజన్ అవార్డుల ఎంపికకు సింగంపల్లి శృతి, యేటా సత్యనారాయణ ఛైర్మన్లుగా వేర్వేరు కమిటీలను నియమించారు. 2025 టీవీ అవార్డుల ఎంపిక బాధ్యతను కొమ్మనపల్లి గణపతిరావుకు అప్పగించారు. అలాగే 2025 నంది నాటకోత్సవ అవార్డుల ఎంపికకు పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, నాటికలు, బాలల నాటికలు, కళాశాల, విశ్వ విద్యాలయ నాటికల విభాగాల్లో ప్రత్యేక స్క్రూటినీ, ఫైనల్ జ్యూరీలను ఏర్పాటు చేశారు. జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపికకు 2017 నుంచి 2024 వరకు, 2025 సంవత్సరానికి వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ రెండు కమిటీలకు ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ తదితరులు వివిధ కమిటీల్లో సభ్యులుగా నియమితులయ్యారు.

నంది అవార్డుల ప్రస్థానానికి 60 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక స్మారక సంచికను ప్రచురించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రముఖ సినీ పాత్రికేయుడు రెంటాల జయదేవ ఛైర్మన్‌గా ఆరుగురు సభ్యులతో సావనీర్ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తంగా పెండింగ్‌లో ఉన్న అవార్డుల ఎంపికకు జ్యూరీల నియామకం, ప్రదానోత్సవాలకు ఏర్పాట్లు చేయడంతో తెలుగు చలనచిత్ర, టెలివిజన్, రంగస్థల రంగాలకు మళ్లీ పూర్వ వైభవం తీసుకు రావాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వచ్చే నెలలో జరగనున్న నంది అవార్డుల వేడుకలపై కళాకారులు, సినీ ప్రముఖుల్లో ఆసక్తి నెలకొంది.

Exit mobile version