ఢిల్లీ : బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. భారతదేశంతో పూర్తిగా సంబంధాలు దెబ్బ తినడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దేశ భవిష్యత్తుకు మంచిది కాదన్నారు. ముహమ్మద్ యూనస్ హయాంలో తన ప్రభుత్వం పతనానికి దారితీసిన అక్రమం తీవ్రమైందని హసీనా ఆరోపించారు . బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తిని కొట్టి చంపడం సహా హింస ముప్పు భారతదేశంలో తీవ్ర ఆందోళనలను రేకెత్తించిందన్నారు. ముఖ్యంగా దేశంలోని భారత దౌత్య కార్యకలాపాలకు రాడికల్ గ్రూపులు ఇటీవల బెదిరింపులు చేస్తున్న నేపథ్యంలో షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
దీనికంతటికి ప్రధాన కారకుడు మహమ్మద్ యూనస్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తీవ్రవాద శక్తులు విదేశాంగ విధానాన్ని రూపొందించడానికి అనుమతించిందని హసీనా అన్నారు. భారతదేశం చాలా కాలంగా బంగ్లాదేశ్‌కు అత్యంత దృఢమైన భాగస్వామగా ఉందన్నారు. ఇండియా పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉండడం వల్ల యూనస్ కంటే బంగ్లాదేశ్ దేశానికే ఎక్కువగా నష్టం చేకూరుస్తుందని, ఆ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిదన్నారు. అయితే ఇదే సమయంలో చట్టబద్ధమైన పాలన పునరుద్ధరించబడిన తర్వాత సంబంధాలు సాధారణం అవుతాయని షేక్ హసీనా ఆశాభావం వ్యక్తం చేశారు. భారత దౌత్య కార్యకలాపాలు, మీడియా కార్యాలయాలపై దాడులకు పాల్పడడాన్ని ఖండించారు. దోషులుగా తేలిన ఉగ్రవాదులను జైలు నుండి సర్కార్ విడుదల చేసిందని ఆమె ఆరోపించారు.



















