Shakambari Utsvalu : కనకదుర్గ అమ్మవారి ఇంద్రకీలాద్రి పై శాకాంబరీ ఉత్సవాలు (Sakhambari Ustavalu) సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. హరిత వర్ణంలో శోభాయమానంగా అమ్మవారు దర్శనమిచ్చారు. జులై 10 వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో మొట్టమొదటి రోజు కావడంతో ఆలయాన్ని కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళతో ప్రత్యేకంగా అలంకరించారు.
Shakambari Utsvalu Updates
ఈ ప్రత్యేక అలంకరణ కోసం దాదాపు 10 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు వినియోగించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన ఆలయంలో కనకదుర్గ అమ్మవారు, మహామండపంలో ఉత్సవ మూర్తి, ఉపాలయాల్లోని ఇతర దేవతా విగ్రహాలు— హరిత రంగు ఆకర్షణీయ శోభను అందించాయి.
విస్తృతంగా చేసిన ఏర్పాట్లు
గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల దాతల సహకారంతో గత పదిహేను రోజులుగా కూరగాయల సేకరణ చేపట్టారు. ఉత్సవాల ప్రారంభ దినాన ఆలయ అలంకరణతో పాటు ప్రసాదంగా అందించే కదంభం తయారీకి సుమారు 50 టన్నుల కూరగాయలు వినియోగించారని అధికారులు వెల్లడించారు.
ఆషాఢ మాసంలో జరిగే ఈ పండుగ సందర్భంగా దుర్గమ్మకు సారె సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ సిబ్బందికి సెలవులు రద్దు చేసి, ప్రత్యేక విధులను కేటాయించారు.
దర్శనాలపై తాత్కాలిక పరిమితులు
భక్తుల రద్దీకి అనుగుణంగా జూలై 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక దర్శనాలు, అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు.
దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు శాకాంబరీ ఉత్సవాలను తిలకిస్తూ, కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇంద్రకీలాద్రి యావత్ హరిత శోభతో నిండిపోతూ భక్తుల మనసులను ముగ్ధులను చేస్తోంది.
ఈ శాకాంబరీ ఉత్సవాలు (Shakambari Utsvalu) కనకదుర్గమ్మ ఆలయంలో భక్తిభావంతో, సంప్రదాయపరంగా సాగుతుండటంతో అన్ని వయసుల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.
Also Read : TTD Annaprasadam Exclusive : తిరుమల అన్నప్రసాదంలో కొత్త మార్పులు



















