ముంబై : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటర్, క్రికెట్ అనలిస్టు వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా టీం ఇండియా వన్డే జట్టుకు కెప్టెన్ గా ఎంపికైన శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ, పూర్ పర్ ఫార్మెన్స్ పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక ఆటగాడు ఇలాగేనా ఆడేది అంటూ ఫైర్ అయ్యారు. భారత జట్టు పేలవమైన బ్యాటింగ్ తీరుపై వీరేంద్ర సెహ్వాగ్ అసహనం వ్యక్తం చేశారు. ముందుగా చెప్పాలంటే, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ పట్ల నాకు ఏమాత్రం సంతృప్తి లేదన్నారు. క్రీజులో కుదురుకున్న ఇద్దరు బ్యాటర్లు ఉన్నప్పుడు, 15వ ఓవర్‌లో వాషింగ్టన్ సుందర్‌ను బౌలింగ్‌కు తీసుకు రావడంలో అర్థమే లేదన్నాడు.
ఊహించినట్లుగానే ఆ ఓవర్‌లో భారీగా పరుగులు సమర్పించు కోవడం పట్ల ఫైర్ అయ్యారు సెహ్వాగ్ . అది నిజంగా చాలా పేలవమైన నిర్ణయం అని పేర్కొన్నాడు. ఇక భారత బ్యాటింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదని ఎద్దేవా చేశాడు . గత కొన్నేళ్లుగా, ఎవరూ కూడా ‘మ్యాచ్-ఫినిషర్’ (మ్యాచ్‌ను విజయవంతంగా ముగించే ఆటగాడు) బాధ్యతతో నిలకడగా బ్యాటింగ్ చేసిన దాఖలాలు లేవన్నాడు వీరేంద్ర సెహ్వాగ్. క్రికెట్ అంటే కేవలం ఎప్పుడూ సిక్సర్లు కొట్టడం మాత్రమే కాదన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందన్నాడు. జట్టు ఇలాగే పేలవమైన ఆటను కొనసాగిస్తే, ఇలాంటి ఫలితాలు రావడం ఖాయమన్నాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్.
