న్యూఢిల్లీ : తళపతి విజయ్ నటించిన జన నాయగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ తమిళ సినీ నటుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు ఆర్. శరత్ కుమార్. పొంగల్ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడారు. విజయ్ మూవీ నిలిచి పోవడం పట్ల రాజకీయ ఉద్దేశాలు ఆపాదించడం సరికాదన్నారు. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. పరాశక్తి అనేది తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం గురించిన సినిమా అని చెప్పారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 1965 కాలం నాటి కథ అని పేర్కొన్నారు. హిందీని అధికార భాషగా చేయాలని అనుకున్నందుకే వారిని ఆ విధంగా చూశారని తెలిపారు శరత్ కుమార్.
కాబట్టి ఆ సినిమా హిందీ వ్యతిరేక ఉద్యమ సమయంలో ఏమి జరిగిందో చిత్రిస్తుందని చెప్పారు. అయితే ‘జన నాయగన్’ సినిమాపై సెన్సార్ బోర్డుకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని వెల్లడించారు. సెన్సార్ బోర్డు ఒక స్వతంత్ర సంస్థ అని స్పష్టం చేశారు ఆర్. శరత్ కుమార్. తాను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడినని, నా సినిమానే నాలుగేళ్ల పాటు నిలిచి పోగలిగితే, విడుదల చేయడానికి సరిపోదని భావించే ఏ సినిమా విడుదలను అయినా సెన్సార్ బోర్డు అడ్డుకునే సత్తా బోర్డుకు ఉంటుందన్నారు నటుడు. ఈ దేశంలో ప్రతిదాన్నీ రాజకీయం చేయలేరని మండిపడ్డారు.


















