హైదరాబాద్ : కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో వెస్టిండీస్ తో హైదరాబాద్ లో జరిగిన 4వ టి20 మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో మెరిశాడు. విండీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 20 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు. సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. టి20 అంతర్జాతీయ క్రికెట్ లో 100 సిక్సర్లు కొట్టిన ఆరో భారతీయుడిగా సంజు శాంసన్ రికార్డ్ నమోదు చేశాడు. మరో వైపు ఈ మ్యాచ్లో వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అద్భుత ప్రదర్శన కనబరిచి, ఈ పర్యటనలో తన నాలుగో సెంచరీని నమోదు చేశారు. 248 పరుగుల లక్ష్య ఛేదనలో సంజు శాంసన్ దూకుడుగా ఆడారు. తను 22 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తన స్ట్రైక్ రేటు 243.48గా నమోదైంది. ఈ మ్యాచ్ ముగిసే సమయానికి, T20 అంతర్జాతీయ క్రికెట్లో శాంసన్ కొట్టిన సిక్సర్ల సంఖ్య 102కి చేరింది.
అంతకు ముందు ఈ మైలు రాయిని చేరుకున్న ఇతర భారతీయ ఆటగాళ్లలో రోహిత్ శర్మ 206 సిక్సర్లతో టాప్ లో కొనసాగుతుండగగా 179 సిక్సర్లతో సూర్యకుమార్ యాదవ్ , 141 సిక్సర్లతో అభిషేక్ శర్మ , 126 సిక్సర్లతో హార్దిక్ పాండ్యా , 124 సిక్సర్లతో కోహ్లీ తర్వాతి స్థానాలలో కొనసాగుతున్నారు. ఈ ఏడాది సంజు శాంసన్ అద్భుత ఫామ్లో ఉన్నారు. తను 24 మ్యాచ్లలో 29.86 సగటుతో, 178.44 స్ట్రైక్ రేటుతో మొత్తం 687 పరుగులు చేశారు. ఇందులో ఏడు అర్ధ సెంచరీలు ఉండగా, అత్యధిక వ్యక్తిగత స్కోరు 97 (నాటౌట్)గా ఉంది. ముఖ్యంగా T20 ప్రపంచ కప్లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన ‘సూపర్ ఎయిట్’ దశ నుంచి, న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ వరకు వరుసగా మూడు అర్ధ సెంచరీలు సాధించడం తన ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రదర్శనల వల్ల శాంసన్ కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు లభించింది మరియు భారత్ తన మూడవ టీ20 ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకోవడంలో ఇవి కీలక పాత్ర పోషించాయి.
తన టీ20 అంతర్జాతీయ (T20I) కెరీర్లో శాంసన్ 76 మ్యాచ్లలో 68 ఇన్నింగ్స్లు ఆడి, 27.28 సగటుతో, 158.87 స్ట్రైక్ రేటుతో మొత్తం 1,719 పరుగులు చేశారు. ఇందులో మూడు సెంచరీలు , పది అర్ధ సెంచరీలు ఉన్నాయి.
