న్యూఢిల్లీ : ఏఐసీసీ సంచలన ప్రకటన చేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో సమావేశం అనంతరం పలువురు పార్టీకి చెందిన కార్యదర్శుల నియామకం ప్రకటించారు. అధికారికంగా మీడియాకు విడుదల చేశారు. విచిత్రం ఏమిటంటే తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న సంపత్ కుమార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది హై కమాండ్. ఇటీవలే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇసుక మాఫియా కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకోవడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో సంపత్ కుమార్‌ను తొలగించినట్టు సమాచారం.
ఇక తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ స్థానంలో నియమితులైన బీఎం సందీప్‌ను సైతం తొలగించింది కాంగ్రెస్ అధిష్టానం. 81 మందితో నూతన కార్యదర్శుల నియామకాల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో తెలంగాణ నుంచి అజ్మత్ హుస్సేన్, కోలుకొండ సతీష్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒడిశా కార్యదర్శిగా ఉన్న జెట్టి కుసుమ్ కుమార్‌ను అదే పదవిలో కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే మీనాక్షి నటరాజన్ స్థానంలో ఇటీవల నియమితులైన బీఎం సందీప్‌తో పాటు కాంగ్రెస్ నాయకుడు సంపత్ కుమార్‌ను కూడా ఏఐసీసీ కార్యదర్శులుగా తొలగించడం ప్రస్తుతం పార్టీలో కలకలం రేపింది.
