హైదరాబాద్ : రణబీర్ కపూర్ , సాయి పల్లవి నటించిన తాజా చిత్రం ‘రామాయణం’ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సిద్ధమయ్యారు. ఆయనకు చెందిన ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పంపిణీ చేయనుంది. నవంబర్ 5, 2026న దీపావళి పండుగ సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 70, 80, 90వ దశకాల నుంచి నేటి తరం పిల్లల వరకు, ప్రతి ఇంట్లోనూ తాతయ్యలు, అమ్మమ్మలు లేదా నానమ్మలు తమ మనవళ్లకు రామాయణ గాథను ఏదో ఒక రూపంలో పరిచయం చేస్తూనే ఉంటారు. కొందరు కథలుగా చెబితే, మరికొందరు పుస్తకాలు చదివిస్తారు, ఇంకొందరు కుటుంబంతో కలిసి ఈ ఇతిహాస గాథను తెరపై చూసేలా ప్రోత్సహిస్తారు. ఏ తరంలో నైనా శ్రీరాముడు , సీతాదేవి తమ కుటుంబం పట్ల చూపిన ప్రేమ, వారు చేసిన త్యాగాలు అందరినీ కదిలిస్తాయి.
ఇప్పుడు ఈ కాలాతీత ఇతిహాసాన్ని మరోసారి వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించేందుకు నామిత్ మల్హోత్రా, నితీష్ తివారీ సిద్ధమయ్యారు. దీపావళి కానుకగా నవంబర్ 5న విడుదల కానున్న ఈ చిత్రం కోసం, చిత్ర బృందం ప్రమోషన్లలో ,ప్రీ-రిలీజ్ ఒప్పందాల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సొంత నిర్మాణ సంస్థ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ ద్వారా ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో, ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ పౌరాణిక గాథపై అంచనాలు మరింత పెరిగాయి. మన దైనందిన జీవితంలో ప్రతి ఇంట్లోనూ భాగమైన ఈ కథ, ఇప్పుడు అత్యంత అద్భుతమైన దృశ్యాలతో, ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించడానికి సిద్ధమైంది. ఈ ఇతిహాస గాథ ‘రామాయణం’ను ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో ప్రేక్షకులకు అందిస్తున్నందుకు మాకు గర్వంగా ఉందన్నారు.
