ముంబై : ప్రముఖ నటుడు సోనూ సూద్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల కోసం సురక్షితమైన, అందుబాటు ధరలో ఉండే హాస్టళ్లను ఏర్పాటు చేయాలని సోనూ సూద్ పిలుపునిచ్చారు. విశ్వ విద్యాలయాల చుట్టూ ఉన్న ఖాళీ ప్రభుత్వ భూములను గుర్తించి, అక్కడ సురక్షితమైన , తక్కువ ఖర్చుతో కూడిన విద్యార్థి హాస్టళ్లను నిర్మించడానికి లేదా అనుమతించడానికి ప్రయత్నించాలని అన్నారు . క్యాంపస్‌లోనే మరిన్ని వసతి గృహాలను ఏర్పాటు చేసేందుకు విశ్వ విద్యాలయాలకు అదనపు నిర్మాణ అనుమతులు ఇవ్వాలని కూడా ఆయన సూచించారు. దీనివల్ల విద్యార్థులకు భద్రత లభిస్తుందని, తల్లిదండ్రులకు మనశ్శాంతి కలుగుతుందన్నారు. ఇదే క్రమంలో విశ్వ విద్యాలయాలు , ప్రభుత్వాలకు ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా మనం ప్రాణాలను కాపాడగలుగుతామని అన్నారు సోనూ సూద్.
కొన్నిసార్లు విధానంలో చేసే చిన్న మార్పు ఒకరి గొప్ప కలను కాపాడగలదు అని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో సుమారు ఏడు లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా హాస్టల్ సామర్థ్యం కేవలం 30,000 మాత్రమేనని అన్నారు. అంటే ప్రతి 31 మంది విద్యార్థులలో కేవలం ఒకరికి మాత్రమే హాస్టల్ వసతి లభిస్తోందని ఆయన ఎత్తిచూపారు. విశ్వ విద్యాలయాల చుట్టూ ఉన్న ఖాళీ ప్రభుత్వ భూములను గుర్తించి, అక్కడ సురక్షితమైన, అందుబాటు ధరలో ఉండే విద్యార్థి హాస్టళ్లను ఎందుకు ఏర్పాటు చేయకూడదు? అని సర్కార్ ను ప్రశ్నించారు సోనూ సూద్. క్యాంపస్‌లోనే మరిన్ని వసతి గృహాలను నిర్మించడానికి విశ్వవి ద్యాలయాలకు అదనపు నిర్మాణ అనుమతులు ఇవ్వాలని సూచించారు. ఢిల్లీలోని సత్య నికేతన్‌లో భవనం కూలి ఏడుగురు మరణించడం, నిర్మాణ ప్రమాణాలు, భద్రతా నిబంధనల అమలుపై ప్రశ్నలు తలెత్తిన నేపథ్యంలో, నగరాల్లో విద్యార్థుల కోసం సురక్షితమైన , అందుబాటు ధరలో ఉండే వసతిని కల్పించాలని నటుడు సోనూ సూద్ కోరారు.



















