హైదరాబాద్ : . 42 శాతం రిజర్వేషన్ల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు మోసం చేశాయనే బాధతో బలిదానం చేసుకోవడం సాయి ఈశ్వర చారి ఘటన కలకలం రేపింది. దీనిపై తీవ్రంగా స్పందించారు బీసీ ఇంటెక్చువల్ ఫోరం అధ్యక్షుడు తొగర్ల చిరంజీవులు. ఇటువంటివి పునరావృతం కాకూడదని అన్నారు. హక్కుల కోసం పోరాటం చేస్తున్న బీసీ, బహుజన యువకులు ఇలాంటి చర్యలకు దిగొద్దని కోరారు. శుక్రవారం చిరంజీవులు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధనలో 12 వందల మందికి పైగా బీసీ, బహుజన, వంచిత వర్గాల బిడ్డలు తమ ప్రాణాలు అర్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చాలు, ఇక నుంచి బలిదానాలు కాదు, పోరాటమే మార్గం అన్నారు. మన హక్కులు, మన రిజర్వేషన్లు, మన గౌరవం ఆత్మహత్యలతో రాదని అన్నారు.
ఐక్యత, స్ఫూర్తి, రాజకీయ చైతన్యంతో మాత్రమే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు చిరంజీవులు. మన లక్ష్యం సాధించాలంటే మనం బలంగా, చైతన్యంగా, ఒకటిగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. సాయి ఈశ్వరచారి త్వరగా కోలుకొని మునుపటి ధైర్యంతో, కొత్త సంకల్పంతో తిరిగి జీవితంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు . ఇకపై ఎవరూ ఇలాంటి చర్యలు చేయకండని కోరారు. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. అది మన ఓటు ద్వారా, మన ఆత్మగౌరవం ద్వారా, మన పోరాటం ద్వారా నిర్మించబడుతుంని పేర్కొన్నారు. మన హక్కులను పోరాటం ద్వారా సాధించు కుందామని, మన ప్రాణ త్యాగాల ద్వారా కాదు, మన రాజకీయ సంకల్పం, నిస్వార్థ పోరాటం ద్వారానే సాధ్యం అవుతుందన్నారు.

















