తిరుపతి : తిరుపతి లోని ప్రముఖ పవిత్ర పుణ్య క్షేత్రం శ్రీ గోవింద రాజ స్వామి వారి పవిత్రోత్సవాలకు సంబంధించి శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్ర నామార్చన నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవింద రాజ స్వామి వారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో ఉత్సవ మూర్తులకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం నిర్వహించారు.
అనంతరం మూలవర్లకు, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, పరివార దేవతలకు విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, శ్రీ మఠం ఆంజనేయ స్వామివారికి పవిత్రాలు సమర్పించారు. ఇదిలా ఉండగా శ్రీ గోవింద రాజ స్వామి వారి ఉత్సవాలకు సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) వెల్లడించింది. ఈ ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతి సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు ఈ సందర్బంగా ముఖ్య కార్య నిర్వహణ అధికారి ముద్దాడ రవిచంద్ర. ఇదిలా ఉండగా ఇవాళ జరిగిన పవిత్ర సమర్పణ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, ఏఈవో నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

















