అమరావతి : ఆర్టీసీ అనేది ప్రజా రవాణ వ్యవస్థగానే కాదు… మహిళలకు, దివ్యాంగులకు ఆర్థికంగా అండగా నిలిచే వ్యవస్థగా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 2025 ఆగస్టు 15 స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించింది. అప్పటి వరకు బస్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వాలనే చూసిన ప్రజలకు… స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణాన్ని పరిచయం చేసింది ఆ వర్గం.. ఈ వర్గం అని లేకుండా.. ఎలాంటి షరతులు.. నిబంధనలు లేకుండా అమలవుతున్న ఏకైక పథకంగా స్త్రీ శక్తి పథకమే. ఈ పథకం అమలు ద్వారా ఆర్టీసీకి సంక్షేమ చరిత్రలో ప్రత్యేక స్థానం కల్పించింది సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం.
స్త్రీ శక్తి పథకంతో పేద, మధ్యతరగతి ప్రజల ఆదాయం ఆదా అవుతోంది. ఇది మహిళల్లో ఆర్థిక సాధికారత పెంచింది. ఓ మహిళా ఉద్యోగి ఆఫీసుకు వెళ్లాలన్నా.. ఓ యువతి కాలేజీకి వెళ్లాలన్నా.. మహిళా రైతు ఉత్పత్తులను మార్కెట్టుకు తీసుకెళ్లి అమ్ముకోవాలన్నా ఆర్టీసీ బస్సెక్కి ఉచితంగా తమ గమ్య స్థానాలకు చేరుతున్నారు. అంతే కాకుండా పుట్టింటికి వెళ్లాలన్నా.. బంధువుల ఇంటికి వెళ్లాలన్నా ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అలాగే పండుగ దినాల్లో పుణ్యక్షేత్రాలకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. దీని వల్ల ప్రతి కుటుంబానికి సుమారుగా రూ. 2 వేల నుంచి 2,500 ఆదా అవుతున్నట్టు అంచనా. అంటే ఏడాదికి సుమారుగా రూ. 25 వేలు ఆదా అవుతోందని లబ్దిదారులే స్వయంగా చెబుతున్నారు.
ఇక స్త్రీ శక్తి పథకం వల్ల దేవాలయాలకు ఆదాయం పెరుగుతోంది.. పర్యాటక ప్రాంతాల్లో రద్దీ పెరుగుతోంది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉపాధి మెరుగవుతోంది. అందుకే ఈ పథకం సూపర్ హిట్ అయింది. స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన 9 నెలల్లో 67 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగితే.. సుమారు రూ. 2350 కోట్ల మేర సబ్సిడిని ప్రభుత్వం భరించింది. దీనికి గానూ.. రూ. 720 కోట్లను ప్రభుత్వం ఆర్టీసీకి రీ-ఇంబర్స్ చేసింది. ఈ విధంగా ఎప్పటికప్పుడు రీ-ఇంబర్స్ చేస్తూ ఆర్టీసీపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తోంది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా ఆర్టీసీకి స్త్రీ శక్తి బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో సుమారుగా 92 శాతానికి పెరిగింది. గతంలో సుమారుగా 60 శాతంగా ఉండే ఆక్యుపెన్సీ రేషియో స్త్రీ శక్తి పుణ్యమా అని 92 శాతానికి చేరింది. ఇందులో పురుష ప్రయాణికుల సంఖ్య 40 శాతంగా ఉంది. ఈ పథకం ఓ విధంగా ఆర్టీసీకి అండగా నిలుస్తోంది. స్త్రీ శక్తి కింద వచ్చే సబ్సిడీని ప్రభుత్వం నుంచి అందుకుంటోంది.
