హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అమెరికా లోని హార్వర్డ్ యూనివర్శిటీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఈమేరకు ఈమెయిల్ పంపించినట్లు తెలిపారు. రేవంత్ రెడ్డికి ఇచ్చిన సర్టిఫికెట్ ను వెనక్కి తీసుకోవాలని కోరానని చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఎదుర్కోనన్ని క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నాడని తెలిపారు. రేవంత్ రెడ్డిపై 89 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఓటు కు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ కి దొరికి, దాదాపుగా 50 రోజులు జైలులో గడిపాడని, ప్రస్తుతం సీఎంగా పలు స్కాంలకు పాల్పడుతూ దోచుకుంటున్నాడని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
తెలంగాణ ప్రజల మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడని, ప్రతి చోటా అభ్యంతరకరమైన భాష ను ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నాడని, రాజకీయ నాయకుడిగా తను 21వ శతాబ్దానికి పనికి రాడని అన్నారు ఆర్ఎస్పీ. ప్రాచీన రాతి యుగం లో కూడా ఇలాంటి నాయకులు ఉండి ఉండరని పేర్కొన్నారు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న నాయకులకు హార్వర్డ్ యూనివర్శిటీ ఎలా సర్టిఫికెట్ ప్రదానం చేసిందో అర్థం కావడం లేదన్నారు. ఈలాంటి ట్రాక్ రికార్డు ఉన్న నాయకులకు హార్వర్డ్ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇవ్వడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

















