హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన నీచాతి నీచమైన కామెంట్స్ పై భగ్గుమన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మీరు ఒక రాష్ట్రానికి బాధ్యత కలిగిన సీఎం అని మర్చిపోయారంటూ మండిపడ్డారు. ఒక మాజీ సీఎం, ఒక రాష్ట్ర సాధకుడి గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. కానీ నోటికి వచ్చినట్లు ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు ఆర్ఎస్పీ. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. జనం మిమ్మల్ని , మీ భాషను చూసి అసహ్యించు కుంటున్నారని , ఆ విషయం గుర్తిస్తే మంచిదని రేవంత్ రడ్డికి హితవు పలికారు.
ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ అంతర్గత సమావేశాలలో కూడా కేసీఆర్ ఏనాడూ మీ గురించి వ్యక్తిగత విమర్శలు , ఆరోపణలు చేయలేదన్నారు. కాకపోతే గాడి తప్పిన ప్రజా పాలన గురించి, అడ్డగోలు హామీల గురించి, అప్పనంగా ఏపీకి నీళ్లను దోచి పెట్టడంపై మాత్రమే నిలదీశారని అన్నారు ఆర్ఎస్పీ. కేవలం ప్రజల గురించి, పథకాల గురించే మాట్లాడారు. చివరికి వరంగల్ రజతోత్సవ సభలో కూడా మీ ప్రస్తావన తీసుకు రాలేదన్నారు. కానీ మీరు మరింత స్థాయికి దిగజారి మాట్లాడటం భావ్యం కాదన్నారు . కోస్గి సభా వేదికగా మీరు అత్యంత దారుణంగా, సభ్య సమాజం సిగ్గు పడేలా, తల దించుకునేలా మాట్లాడటాన్ని ఎవరూ హర్షించడం లేదన్నారు ఆర్ఎస్పీ.



















