హైదరాబాద్ : బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. స్వంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే పై దాడి జరుగుతుంటే ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. మందుల సామేల్ పై దాడి జరిగినా కనీసం స్పందించక పోవడం దారుణమన్నారు. ఇక తను తెలంగాణ ప్రజలను ఏం రక్షిస్తాడంటూ మండిపడ్డారు. అయితే ఎమ్మెల్యే మందుల సామేల్ బహిరంగంగా ఒక కులం సంప్రదాయాలను ఉద్దేశించి మాట్లాడాల్సింది కాదన్నారు. గతంలో షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ కూడా ఇలాగే మాట్లాడారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఎన్నో సార్లు కులాలను కించపరిచే విధంగా మాట్లాడారని , యథా రాజా తథా ప్రజా అన్నట్టుగా పాలన తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ఎస్పీ.
ఎమ్మెల్యే సామేల్ పొరపాటు జరిగిందని, నోరు జారిందని వివరణ ఇచ్చినా సరే ఆగకుండా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ తన రౌడీ మూకలతో ఎమ్మెల్యే ఇంటిపై కోడిగుడ్ల దాడి చేయించడం ఎంత దారుణం, ఎంత పైశాచికం అని భగ్గుమన్నారు. హోం మంత్రి రేవంత్ రెడ్డికి తెలవకుండానే ఈ దాడి జరిగి ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే… ఇక సామాన్య ప్రజల సంగతేమిటి అని అన్నారు . ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయలేని సీఎం, హోంమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

















