అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. శుక్రవారం బీసీ విద్యార్థులకు తీపి కబురు చెప్పారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్న బీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరంలో భాగంగా పీఎం యశ్వసి పథకం కింద రెండో విడతగా కళాశాల, పాఠశాల ఓబీసీ, ఈబీసీ, డీఎన్టీ విద్యార్థులకు స్కాలర్ షిప్పుల నిమిత్తం రూ.90.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు మంత్రి సవిత. 2025-26 విద్యా సంవత్సరానికి గానూ రెండో విడతగా రూ.69.40 కోట్లను పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు కోసం కూటమి ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ నిధులు కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో చదువుతున్న బీసీ, ఈబీసీ, డీఎన్టీ విద్యార్థులకు ఉపకరిస్తాయన్నారు. ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు గానూ రెండో విడతగా రూ. 21.10 కోట్లను విడుదల చేసిందన్నారు.
పాఠశాల స్థాయిలో చదువుతున్న అర్హులైన బీసీ, ఈబీసీ, డీఎన్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించనున్నట్లు స్పష్టం చేశారు మంత్రి ఎస్. సవిత. రెండు ఉత్తర్వుల ద్వారా రూ. 90.50 కోట్లను వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిందన్నారు. బీసీ బిడ్డల విద్యకు సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ఆర్థిక ఇబ్బందులతో బీసీ విద్యార్థులు విద్యకు దూరం కాకూడదన్నదే ఆయన లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ లు మంజూరు చేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం నిధులు అన్ని వర్గాలతో పాటు బీసీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశామన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లు పంపిణీ చేశామన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామన్నారు.



















