హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఉమ్మడి జిల్లాలో భారీ ఎత్తున రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గాల వారిగా జరుగుతున్న వర్క్ ప్రోగ్రెస్ ఇంకా మెరుగవ్వాలన్నారు. ఇప్పటి వరకు 3,918కి.మీ రోడ్ల నిర్మాణం కోసం రూ.5159 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. 2025-26కు సంబంధించి రూ.868 కోట్లతో చేపట్టిన 422.36 కి.మీ రోడ్ల పనుల పురోగతి సంతృప్తికరంగా ఉందన్నారు. అయితే పలు హై లెవెల్ బ్రిడ్జిలు ,రైల్వే ఓవర్ బ్రిడ్జిల పనులు నిర్ణీత సమయానికి పూర్తి కావాలని ఆదేశించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నంది పహాడ్ బ్రిడ్జి పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఇంకా బాగా పని చేయాలన్నారు. డా.బి.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియట్ లో ఏర్పాటు చేయనున్న షిడెడ్ పార్కింగ్ (సోలార్ కార్ పార్కింగ్) పనుల పురోగతిపై సమీక్షించారు.
026 డిసెంబర్ నాటికి పనులు పూర్తవ్వాలని అధికారులను ఆదేశించారు. సోలార్ కార్ పార్కింగ్ అందుబాటులోకి వస్తే సెక్రటేరియట్ కోసం 90 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. నెలవారీ విద్యుత్ బిల్లులో 16% ఆదా అవుతుందన్నారు. రాష్ట్ర సెక్రటేరియట్ సోలార్ పార్కింగ్ ను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా సీఆర్ఐఎఫ్ ద్వారా నిర్మిస్తున్న రోడ్లు, సేతుబంధన్ పథకం బ్రిడ్జిలు, పురోగతిలో ఉన్న పలు ఆర్ఓబీ పనుల్లో వేగం పెంచాలనీ ఆర్ అండ్ బి ఇంజనీర్లను ఆదేశించారు. ఈ సమీక్షలో ఈఎన్సి (అడ్మిన్) లింగారెడ్డి, సి.ఈ లు వసంత్ నాయక్, వనజ, ధర్మారెడ్డి, ఈ అహ్మద్ అబ్దుల్ అలీ, రూప్ కరణ్, డి.ఈ రూపారాణి, గంగాధర్ పలువురు ఆర్ అండ్ బి ఇంజనీర్లు పాల్గొన్నారు.
