తిరుమల : తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కళ కళ లాడుతోంది. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి భక్తుడు కోరుకునేది అన్నదానం, శ్రీవారి లడ్డూ. ఈ మేరకు కోట్లాది రూపాయలు ఖర్చువుతోంది అన్నదానానికి. ప్రతీ రోజూ 70 వేల మందికి పైగా అన్నదానంలో శ్రీవారి ప్రసాదాన్ని తీసుకుంటున్నారు. ఈ మేరకు తమ కోరిన కోర్కెలు నెరవేరే భక్తులు ప్రత్యేకించి పేదల, భక్తుల ఆకలి తీరుస్తున్న టీటీడీ అన్నదానం ట్రస్టుకు తమకు తోచిన రీతిలో విరాళాలు అందజేస్తున్నారు.
ఇందులో భాగంగా గుంటూరుకు చెందిన బృందా న్యూరో సెంటర్ టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10,00,116, శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116, బర్డ్ ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ అధినేతలు డాక్టర్ హనుమ శ్రీనివాస రెడ్డి, సిద్ధార్థ లు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీలను అందజేశారు.
అదేవిధంగా బెంగుళూరుకు చెందిన శ్రీ శ్రీపతి శ్రీనివాస్, కొటారు సునీల్ లు శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించగా, విశాఖపట్నంకు చెందిన శ్రీ చాగర్లమూడి సీతారామయ్య టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. వీరి తరఫున టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీలను అందజేశారు.
