తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడారు. సంవత్సరంలో నాలుగుసార్లు అనగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారని చెప్పారు.
కాగా, స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి, శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారని తెలిపారు. ఆ తరువాత స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించామన్నారు. అనంతరం భక్తులకు దర్శనం ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డాక్టర్ ఏ.శరత్, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో లోకనాథం, పలువురు బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
