అమరావతి : మార్కాపురం జిల్లాలో బస్సు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోన్న వారికి రూ.2 లక్షల చొప్పున సాయం అందించాలని సూచించారు. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర మంత్రివర్గం తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. బస్సు ప్రమాద ఘటనలో పలువురు మృతి చెందటం పట్ల సంతాపాన్ని తెలిపింది. బాధిత కుటుంబాలకు రాష్ట్ర మంత్రివర్గం సానుభూతిని తెలియ చేసింది. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, బాధితులకు అందుతున్న వైద్యాన్ని పర్యవేక్షించాలని మంత్రులు, అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ప్రమాదాల నివారణతో పాటు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రవాణా, రహదారులు, భవనాల శాఖ, పోలీసు, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రణాళికలు అమలు చేసి ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాలని అన్నారు. రాయవరం ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని అన్నారు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.


















