అమరావతి : ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు సంచలన ప్రకటన చేశారు.
తూడు, గుర్రపుడెక్క తొలగింపు వంటి నీటి అడ్డంకులు తొలగింపు, పూడిక తీత పనుల కోసం చంద్రబాబు ప్రభుత్వం 397 కోట్లు విడుదల చేసిందని వెల్లడించారు. వెంటనే పనులు మొదలు పెట్టేలా సిఈ స్దాయి నుండి కింది స్దాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు . సీజన్ మొదలయ్యేలోగా కాలువల పూడికతీత, తవ్వకం, తూడు, గుర్రపుడెక్క తొలగింపు వంటి అత్యవసర పనులు పూర్తి చేయాలి. 10 లక్షల లోపు పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో నామినేషన్ పద్దతిలో చేపట్టాలని ఆదేశించారు. అయితే 10 లక్షలు దాటిన పనులకు షార్ట్ టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలని అన్నారు.
ఎట్టి పరిస్దితుల్లోనూ అన్ని పనులూ, సీజన్ మొదలయ్యే నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు నిమ్మల రామానాయుడు. గేట్లు, షట్టర్లు, వంటి మెకానికల్ పనులను తప్పనిసరిగా అసిస్టెంట్ ఇంజనీర్ పరిశీలించి, సక్రమంగా పనిచేసే స్దితిలో ఉన్నాయనే ధ్రువీకరణ పత్రాన్ని, చీఫ్ ఇంజనీర్ కు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. సాగు నీటి సంఘాలు ఆధ్వర్యంలో, వారి పరిధిలోని పనులను, మే నెలాఖరుకు పూర్తి చేయాలని అన్నారు. పనులను సకాలంలో పూర్తి చేయడానికి చీఫ్ ఇంజనీర్లు, సూపరిండెంట్ ఇంజనీర్లు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు నిమ్మల రామానాయుడు. గత 5ఏళ్ళ వైసిపి ప్రభుత్వం కాలువల నిర్వహణ, మరమ్మత్తులు, పూడికతీత పనులను గాలికి వదిలి వేసిందన్నారు.
